తన భర్త తనను వివస్త్రను చేసి ఓ గదిలో బంధించాడని ఓ మహిళ విలేకర్ల సమావేశంలో చెప్పుకున్న పరిస్థితి ఈ సమాజంలో దాపురించింది. సైదాబాద్ లో బోడ పద్మ అనే మహిళ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లినా.. ఉపయోగం లేకపోవడంతో చివరికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన బాధలను ప్రపంచానికి చెప్పింది. తన భర్త కొర్ర ధర్మానాయక్ తనను కొంత కాలంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.
ఆమె భర్త నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎస్ ఈ గా పనిచేస్తున్నాడు. 2008 లో ఇరిగేషన్ సర్కిల్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ దాడులు చేసి కొంత ప్రాపర్టీని స్వాధీనం చేసుకుందని ఆమె తెలిపింది. అలా స్వాధీనం చేసుకున్న వాటిలో తనపేరు మీద కూడా కొన్ని ఉన్నాయని చెప్పింది. వాటిని అతని బదలాయించాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ వేదింపులు భరించలేక తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేయించారని బాధితురాలు గుర్తు చేసుకుంది. ఈ నెల 4న భర్త, అతని తల్లి, సహచరులు బలవంతంగా తనతో యాసిడ్ తాగించారని ఆమె ఆరోపించింది. ఆసుపత్రిలో తనకు 4 సర్జరీలు జరిగిన తరువాత బతికి బయటపడ్డానని వాపోయింది. స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేసినా.. పట్టించుకోలేదని చెప్పింది. తాను బయటకు వస్తే ఈ విషయాలన్ని బయపటడతాయని.. ఇంట్లో ఓ గదిలో వివస్త్రను చేసి బంధించారని రోదించింది. ఎలాగో ఒకలా ఇప్పుడు బయట పడ్డానని.. తమకు న్యాయం చేయాలని నగర పోలీసు ఉన్నతాధికారులను కోరింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదైంది.