సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆయన అమిత్ షాను కలిశారు. అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ 40 నిమిషాల పాటు కొనసాగడం విశేషం. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్టుగా సమాచారం.
అయితే వాస్తవానికి ఈ రోజు ఉదయం వరకూ నిర్మల సీతారామన్ సీఎం జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో జగన్ ఈ రోజు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యేందకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వడంతో జగన్ తన ప్రోగ్రాం మార్చుకొని ఆమెతో భేటీ అవ్వడం జరిగింది.
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై ఈ భేటీలో జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే 15 రోజుల వ్యవధిలో జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17 వ తేదీన ఆయన మోడీతో పాటు అమిత్ షాతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఆయన వెంటనే రెండో సారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరో వైపు వైఎస్ వివేకా కేసు దర్యాప్తు కీలక దశలో ఉండడం,ఎన్నికల నగారా మోగే క్రమంలో జగన్ వరుస హస్తిన యాత్రల పై ఆసక్తి నెలకొంది. అయితే గురువారం ఆయన ముందుగా మోడీని తరువాత అమిత్ షాను భేటీ అవుతారని వార్తలొచ్చాయి. కాని అనూహ్యంగా బుధవారం రాత్రి 11 గంటలకు అమిత్ షా జగన్ ను ఇంటికి పిలుపించుకున్నారు. దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ భేటి కొనసాగి.. 11.40 నిమిషాలకు జగన్ బయటికి వచ్చారు.