అగ్నిపథ్ పథకంపై నిరసనలతో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికి పోయింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు రైల్వేస్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హింసకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపు ద్వారానే విధ్వంసానికి ప్రణాళికలను రచించినట్టు గుర్తించి ఆ సందేశాలను పరిశీలిస్తున్నారు.
రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కీలక నిందితున్ని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అల్లర్ల కుట్రలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరిట వాట్సాప్ గ్రూపును సుబ్బారావు క్రియెట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇనిస్టిట్యూట్ కు చెందిన విద్యార్థులను రెచ్చగొట్టి విధ్వంసానికి కారణమైనట్టు పోలీసుల విచారణలో తేలినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట విధ్వంసానికి వ్యూహరచన చేసి దాన్ని విద్యార్థులకు అతను వివరించినట్టు సమాచారం. విధ్వంసానికి కావాల్సిన అన్నింటిని అతనే సమకూర్చినట్టు ,దానికి సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు సేకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆవుల సుబ్బారావు స్వస్థలం ఏపీలోని నర్సాపూర్ కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కోచింగ్ ఇనిస్టిట్యూట్లు ఉన్నట్టు తెలుస్తోంది.