ఇటీవల చాలామంది వయసుతో సంబంధం లేకుండా.. హఠాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ 40 ఏళ్ల కే గుండెపోటుతో మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అప్పటి వరకూ చాలా యాక్టివ్‌గా కనిపించి ఉన్నట్టుండి కుప్పకూలి మన మధ్య లేకుండా వెళ్లిపోతున్నారు. పునీత్ నుంచి తారకరత్న దాకా.. గుండెపోటుతో మృత్యువాత పడిన వారే.
తాజాగా బోయిన్ పల్లిలో ఓ జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే కన్నుమూశాడు. నగరంలోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విశాల్(24).. రోజూలానే శుక్రవారం ఉదయం బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు.
ఏం జరిగిందోనని సహచరులు వచ్చి చూసేలోపే మృతిచెందాడు. అయితే ఆయనను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు. విశాల్ 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. 2023లో ఉద్యోగాన్ని సంపాదించి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
కిషన్ రెడ్డి మేనల్లుడు కూడా!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 50 ఏళ్లు. కిషన్ రెడ్డి సోదరి లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డి దంపతుల కుమారుడు జీవన్ రెడ్డి. ఆయన మృతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుఃఖసాగరంలో మునిగిపోయారు. కిషన్ రెడ్డి అక్కాబావ కుటుంబం సైదాబాద్ వినయ్ నగర్‌లో నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్నప్పుడే జీవన్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.
జీవన్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని హుటాహుటిన కాంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ వద్ద ఉన్న అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. జీవన్ రెడ్డి హఠాన్మరణంతో మేనల్లుడిని కోల్పోయాను అనే ఆవేదనతో కిషన్ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.