అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయానికి సంబంధించి 50 శాతం పనులు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ లోపే పనులు పూర్తి చేయాలని ఆలయ ట్రస్టు ప్రయత్నిస్తోంది. 2024 జనవరి నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని తాము భావిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.
తాము అనుకున్న ప్రకారమే ఆలయ నిర్మాణ పనులు సాగుతున్నాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రామమందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి ఇప్పటికే ప్రకటించారు.
మకర సంక్రాంతి పర్వదినాన ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించినున్నారు. ఆ తర్వాత ఆలయానికి భక్తులను అనుమతించనున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది.