భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో సలహా, సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఉక్రెయిన్ పరిస్థితులు, అక్కడి భారతీయులను తరలిస్తున్న విధానం, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సమావేశంలో పాల్గొన్న 21 మంది సభ్యులకు కేంద్రం వివరించింది.
ఈ సమావేశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి జైశంకర్ తో సహా అతని టీమ్ సభ్యులు అద్భుతంగా సమాధానాలు ఇచ్చారని.. తమ సూచనలను కూడా తీసుకున్నారని పేర్కొన్నారు.
కేంద్ర విదేశాంగ విధానం స్పిరిట్ ఇలాగే ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని థరూర్ ప్రశంసించారు. దేశం విషయానికి వస్తే.. మనమందరమూ ఒక్కటే అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. అయితే.. ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.
ఇక ఇదే సమావేశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ విషయంలో విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో సలహాలు, సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. చర్చ అద్భుతంగా జరిగింది. వ్యూహాత్మక, మానవ కోణంలో ఉక్రెయిన్ విషయంపై చర్చించాం. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి తీసుకువచ్చే ప్రక్రియలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అందరూ మద్దతిచ్చారు అంటూ జైశంకర్ ట్వీట్ చేశారు.