విధి నిర్వాహణలో నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఇళ్లకు హై వోల్టేజ్ విద్యుత్ పంపినీ చేసిన తెలంగాణ డిస్కమ్ కు వినియోగదారుల కోర్టు రూ.39000 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే…అక్టోబర్ 3,2015 న సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మూడు వీధుల్లో విద్యుత్ లైన్ల రిపేర్ కోసం కొంత సేపు కరెంట్ నిలిపివేశారు. ఆ తర్వాత విద్యుత్ ను పునరుద్ధరించడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి హై వోల్టేజ్ పాసై వంద ఇళ్లలోని ఎలక్ట్రికల్ వస్తువులన్నీ తగులబడిపోయాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఈ విషయంపై భాస్కరన్ అనే వ్యక్తి రిపేర్ చేసిన విద్యుత్ సిబ్బందిని నిలదీయగా విషయాన్ని తె లంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత భాస్కరన్ తాను రిపేర్ చేయించుకుంటే 13,690 ఖర్చయిందని..ఆ బిల్లు చెల్లించాలని పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులను కలిశారు. ఎన్నిసార్లు తిరిగినా వారు డబ్బులు చెల్లించకపోవడంతో అన్ని ఆధారాలతో వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాడు. వినియోగదారుల ఫోరమ్ నోటీసులను అందుకొని కూడా అధికారులు స్పందించకపోవడంతో పవర్ డిస్ట్రిబూషన్ కార్పోరేషన్ సేవల లోపం కారణంగానే నష్టం జరిగిందని చెబుతూ బాధితుడికి రూ.39000 నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది.