తెలంగాణ గుండె చప్పుడు ఉంది కానీ.. ఈ ఆంధ్రా గుండె చప్పుడు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది అసలు సంగతి. నిన్నటిదాకా తెలంగాణ గుండె చప్పుడు వినిపించిన అధికార పార్టీ ఛానల్ బాధ్యతలను తాజాగా ఆంధ్రా వారికి అప్పచెప్పడంతో తెలంగాణ వాదులు దానిని ఆంధ్రా గుండె చప్పుడు అనే పిలవాలని అంటున్నారు. దానికి గల కారణాలను కూడా వివరిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆ ఛానల్ లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయట. కంటెంట్ ఎడిటర్, సీఈఓలు తమదైన స్టయిల్ లో పనితనాన్ని చూపిస్తున్నారని.. వారి పనితనానికి యాంకర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారని అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు గుసగుసలాడుకుంటున్నారు. సదరు కంటెంట్ ఎడిటర్ ఎలక్ట్రానిక్ మీడియాలో తనకు దశాబ్దాల కాలం అనుభవం వున్నట్లు తెగ బిల్డప్ ఇవ్వటమే కాకుండా.. యాంకర్లు బులిటెన్ ఎలా చేస్తున్నారో తానే స్వయంగా స్టూడియోలో కుర్చీ వేసుకొని కూర్చొని మరి అబ్జర్వ్ చేస్తున్నాడంట. అంతేకాదు అప్పుడప్పుడు పీసీఆర్ లోకి వెళ్లి అక్కడ నుండి యాంకర్లను అబ్జర్వ్ చేస్తున్నాడంట. అదంతా చూసి ఇదేం పిచ్చిరా బాబు అని యాంకర్లు తెగ ఫీల్ అవుతున్నారని సమాచారం. అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది. యాంకర్ల రూమ్ దగ్గర కూడా చక్కర్లు కొడుతూ వాళ్ళను గమనిస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు అధికార పార్టీ ఛానల్ లో పనిచేస్తున్న ఉద్యోగులు.
యాంకర్లను సీఈఓ ఛాంబర్ కు పిలిచి తనకు ఎలక్ట్రానిక్ మీడియాలో సుధీర్ఘ అనుభవం ఉన్న లెవెల్ లో బిల్డప్ ఇస్తూ వాళ్లకు న్యూస్ పేపర్స్ ఇచ్చి ఎలా చదువుతారో చూస్తాను చదవండి అని అన్నాడంట ఆ సదరు ఆంధ్రా కంటెంట్ రైటర్. మేము 20 ఏళ్లుగా యాంకర్లుగా పని చేస్తున్నాం.. ఈ ఛానల్ లో 11 సంవత్సరాలుగా బులిటెన్స్ చేస్తున్నాం.. ఈయనకు ఇదేం చాదస్తంరా బాబు అని మనసులో అనుకొని.. ఏం చేస్తాం మన కర్మ అని పేపర్స్ చదివారంట. ఆ మహా ఆంధ్రా మేధావి తనకు తెలుగు మీద అమోఘమైన పట్టు వున్నదని యాంకర్ల ముందు చెప్పుకునే ప్రయత్నం చేయడమే కాకుండా వారి ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ అలా కాదు చదవాల్సింది ఇలా అంటూ అధికారులు అని దీర్ఘంతో చదవకూడదు అంటూ ముక్తాయింపు ఇచ్చాడంట. అంతటితో ఆగకుండా తప్పులు చదివితే తన ఛాంబర్ కు రావాల్సి ఉంటుందని చెప్పాడంట. దాంతో యాంకర్లు అదేంటి తప్పు చదివితే ఆయన ఛాంబర్ కు ఎందుకు వెళ్ళాలని ఒకరి మొహం ఒకరు చూసుకున్నారంట. అదే సమయంలో ఆయన తెలుగు పాండిత్యంపై యాంకర్లకు నవ్వాలో ఏడవాలో తెలియక బిత్తర మోహలు పెట్టుకొని తలలు ఊపారంట.
మరోవైపు తెలంగాణ వాళ్లకు తెలుగు భాష రాదు అనే ధోరణిలో కంటెంట్ ఎడిటర్ ధోరణి వుంది అనే చర్చకు తెర లేచింది. సీఈఓ, కంటెంట్ ఎడిటర్ల హోదాలో ఆంధ్రా వాళ్ళను తెచ్చి పెట్టి తెలంగాణ వాళ్ళను అవమానిస్తున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఛానల్ లో లేడీస్ కి ఉంది ఒకే ఒక్క వాష్ రూమ్. తన ఛాంబర్ కు అటాచ్ గా ఉంది. అది తనకే కావాలని సదరు కంటెంట్ ఎడిటర్ అడగడమే కాకుండా చెప్పా పెట్టకుండా వాడడం మొదలు పెట్టాడంట. అది తెలియక అదే సమయానికి వచ్చిన యాంకర్ భయపడి అక్కడ నుండి వెళ్లిపోయిందని సమాచారం. ఈ పరిణామాలు చూస్తుంటే రానున్న రోజులలో సదరు ఛానల్ లో ఏం జరగబోతుందో అనే ఆందోళన స్టాఫ్ లో నెలకొందని తెలుస్తోంది.