తెలంగాణను వరుణుడు వదలనంటున్నాడు. ఇంకో మూడురోజులపాటు వర్షాలు తప్పవని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు. బుధవారం ఉత్తర ఛత్తీస్ గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల అవర్తనం గురువారానికి దక్షిణ ఛత్తీస్ గఢ్ కు షిఫ్ట్ అయిందని.. సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు.
ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశలో కదిలి.. ఈశాన్య పరిసర తూర్పు, మధ్య బంగళాఖాతంలోని ప్రాంతాలకు చేరుకొని శుక్రవారం సాయంత్రానికి అల్పపీడనంగా మారే చాన్స్ ఉందంటున్నారు అధికారులు. అల్పపీడనంగా మారాక ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం అల్పపీడనం ఏర్పడ్డాక ఉరుములు, మెరుపులతో శనివారం వరకు వర్షాలు ఉంటాయని హెచ్చరించారు అధికారులు.
ఇప్పటికే ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిలాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా వానలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించడంతో అలర్ట్ అయ్యారు ప్రభుత్వ అధికారులు.