బిల్లు రాలేదని తరగతి గదులకు తాళం వేసిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ పరిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇటీవల నిర్మించిన రెండు అదనపు తరగతి గదుల బిల్ రావడం లేదని కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి బుధవారం తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో భగ భగ మండే ఎండలోనే విద్యార్థులు పాఠాలు వినే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2020 ఫిబ్రవరి 15వ తేదీన కానుకుంట గ్రామం హైస్కూల్ లో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.16,40,000 కాంట్రాక్ట్ తీసుకుని రెండు, మూడు నెలల్లో పూర్తి చేశాను.
ఈ నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ మొత్తం బిల్లులోని కేవలం 40 శాతం అంటే రూ.7 లక్షలు మాత్రమే వచ్చాయి. మిగిలిన బిల్లు కోసం స్థానిక ప్రజాప్రతినిధులను, విద్యాశాఖ అధికారులను ఎన్నిసార్లు అడిగినా బిల్లు వేయలేదని, అందుకే తరగతి గదులకు తాళం వేశానని తెలిపాడు.
అయితే ఎండలో విద్యార్థులు పాఠాలు వినలేక ఇబ్బందులు పడుతుండగా, చివరికి ఉపాధ్యాయులు వెళ్లి కాంట్రాక్టర్ ను తాళం తీయాలని కోరగా.. వారి అభ్యర్థన మేరకు తాళం తీశాడు. ఒక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని చెబుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.