తెలంగాణ తెచ్చుకున్నందుకు ఏడ్వాలో… నవ్వాలో తెలియని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి. తాము ఆధారాలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని భయటపెట్టానని, స్వయంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు.
బీహెచ్ఈఎల్ పంపుల విషయంలో చోటుచేసుకున్న అవినీతిని ప్రస్తావించానని, ఏకంగా 7,348 కోట్ల అగ్రిమెంట్ చేసుకొని దోచుకున్నారని నాగం జనార్ధన్‌రెడ్డి విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ .. కాంట్రాక్టర్ల గుప్పిట్లోకి వెళ్లిందని మండిపడ్డారు. ఇలాంటి అవినీతి దేశంలో మరెక్కడా ఉండదన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను కాపాడాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను మొత్తం… ఏపీ సీఎం జగన్ దోచుకెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం ఉండి ఉంటే సంగమేశ్వర ప్రాజెక్టు కట్టే వాళ్లేనా అని ప్రశ్నించారు. ఆరున్నరేళ్లలో పాలమూరులో ఒక్క డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా పూర్తి చేయలేదనిడి మండిపడ్డారు.