ఇప్పటి వరకు అన్నదమ్ములు డబ్బు విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో గొడవలు పడి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు అనేకం చూసి ఉంటాం. కానీ ఇక్కడ చింతపండు పంపకాల విషయంలో జరిగిన గొడవ చివరకు తమ్ముడి ప్రాణాల మీదకు తీసుకుని వచ్చింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన గొడవ చివరకు కత్తితో పొడుచుకునే వరకు వెళ్లింది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన రమేశ్, నరేశ్ లు అన్నదమ్ములు. శుక్రవారం ఉదయం ఇంటి ముందున్న చింత చెట్టు కాయలను రమేశ్ ఏరుకుని ఇంటి లోపల పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తమ్ముడు నరేశ్ తనకు వాటా ఉంటుందని గొడవకు దిగాడు.
ఇంతకాలం నువ్వు ఊర్లో లేకపోయినప్పటికీ చెట్టును నేనే కాపాడాను కాబట్టి నాకు కూడా చింతకాయలలో వాటా ఉంటుందని వాగ్వాదదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. కోపంతో రమేశ్ కత్తితో తమ్ముడు నరేశ్ పై దాడి చేశాడు.
దీనిని గమనించిన స్థానికులు నరేశ్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.