తిరుపతి: నోట్ల రద్దు గుర్తున్నవారందరికీ శేఖర్‌రెడ్డిని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏటిఎంల ముందు ఒక్క నోటు కోసం జనం పాట్లు పడుతున్న రోజుల్లో ఇదే శేఖర్‌రెడ్డి ఇంట్లో కోట్లకు కోట్లు కొత్త నోట్లు దొరికాయి. దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. అప్పట్లో టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్న శేఖర్‌రెడ్డి దగ్గర దొరికిన డబ్బులు చంద్రబాబువే అని అందరూ, ముఖ్యంగా అప్పటి ప్రతిపక్షం వైసీపీ గోల గోల చేసింది.
దాంతో, చంద్రబాబు, శేఖర్‌రెడ్డిని వెంటనే టీటీడీ బోర్డు నుంచి తొలగించారు. ఆ గొడవ అక్కడితో ఆగలేదు. పవన్ కల్యాణ్ కూడా ఘాటైన ఆరోపణలు చేశారు. లోకేష్, శేఖర్‌రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని చంద్రబాబుని నిలదీశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైందో లేదో మళ్ళీ శేఖర్‌రెడ్డి మళ్లీ తెరమీదకు వచ్చారు. 35 మందితో కొత్తగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో శేఖర్‌రెడ్డి ప్లేస్ కొట్టేశారు.
స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే…జీవోలో జనాలని పక్కదోవ పట్టించేందుకు, తెలివిగా శేఖర్ రెడ్డి పేరుని AJ శేఖర్ అని పెట్టారు.
అప్పట్లో చంద్రబాబు, శేఖర్‌రెడ్డిలను తెగ తిట్టిన జగన్ ఎలా ఇలా మారిపోయారని ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది మాత్రం మా రెడ్డి గారి రాజ్యంలో, ఏ రెడ్డి అయినా ఆణిముత్యమే అని తెగ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ లేనివిధంగా ఈసారి టీటీడీ పాలకమండలి వివాదాలకు కేంద్రబిందువయ్యింది.