కొద్ది సంవత్సరాల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరికి శిశువు మృతిచెందిన దారుణాన్ని ఎవ్వరైనా మరచిపోగలరా? ఆ విషాదం జరిగినప్పుడు చంద్రబాబు సర్కారుపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెలరేగిపోయి విమర్శలు చేసింది. దీంతో ప్రభుత్వం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థ ‘చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ’ని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఇప్పుడు అదే వైపీసీ అధికారంలోకి వచ్చింది. ఎలుకలు కొరికి శిశువు మృతికి కారణమై ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి ఇప్పుడు కనకదుర్గమ్మ దేవస్థానం పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును అప్పగించింది. వడ్డించేవాడు మన వాడైతే అఖరి బంతిలో కూర్చున్నా అన్నీ అందుతాయంటారు. పాలించేవాడు మన వాడైతే చాలు బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు కూడా టెండర్లు దక్కుతాయని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు టెండరు అప్పగించేందుకు దుర్గగుడి అధికారులు నిబంధనలను పక్కన పెట్టేశారు. తక్కువ కోట్ చేసిన సంస్థ కంటే మూడు లక్షలు ఎక్కువ కోట్ చేసిన సంస్థకే అప్పగించారు. అంటే దసరా ఉత్సవాల టెండర్లు ఎంత పారదర్శకంగా ఉన్నాయో కనకదుర్గమ్మకే తెలియాలి. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుందని గొప్పగా చెప్పుకుంటున్న జగన్ సర్కార్ ఇప్పుడు ఏమంటుంది..? ఈ కథంతా నడిపించిన తన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై జగన్ ఏ చర్య తీసుకోబోతున్నారు? టెండరు తవ్వి ‘ఎలుక’ను పట్టిన ఈ వ్యవహారంపై ‘తొలివెలుగు’ ప్రతినిధి కేఎం అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఈ సంవత్సరం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే వివిధ రకాల పనులకు సంబంధించి టెండర్ల విషయంలో ఉన్న నిబంధనలను పక్కనపెట్టి, అయిన వారికి కట్ట పెడుతున్నారంటూ పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలకు తగ్గట్టుగానే 18 నెలలపాటు పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను చేపట్టేందుకు ఓపెన్ టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో 11 సంస్దలు పాల్గొనగా 5 సంస్థలు అర్హత సంస్థలుగా దుర్గ గుడి అధికారులు నిర్ధారించారు. ఈ 5 సంస్థల్లో స్పార్క్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థ నెలకు 19,39, 999 కోట్ చేయగా, చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ 22,39,200లకు కోట్ చేసింది. నిబంధనల ప్రకారం తక్కువగా వేసిన వారికి టెండర్లను దుర్గగుడి అధికారులు అప్పగించాలి. కానీ, ఇక్కడ అలా జరగలేదు. రెండో వ్యక్తికి టెండర్‌ను ఖరారుచేశారు. అదేమిటని మొదటి వ్యక్తి ప్రశ్నిస్తే ఏవో కారణాలు చెబుతూ అంత తక్కువ కోట్ చేసి ఎలా మెయింటైన్ చేస్తావంటూ ఆ కాంట్రాక్టరుని దుర్గ గుడి అధికారులు ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కనుసన్నల్లోనే ఆయన చెప్పినటువంటి చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకుడికి అ టెండర్ అప్పగించినట్లు తెలుస్తోంది. 18నెలలు పాటు దుర్గగుడిలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ దక్కించుకుంది. ఈ సొసైటీ అన్నవరం దేవస్థానంలో, ద్వారకా తిరుమల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణకు టెండర్లు వేయగా, అక్కడ ఒక చోట ఈ సంస్థ డిస్ క్వాలిఫై అయింది. అన్నవరంలో డిస్ క్వాలిఫై అయిన సంస్థ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానంలో ఎలా క్వాలిఫై అయిందో ఆ దుర్గమ్మకే తెలియాలి. దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు అన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఐతే ఈ టెండర్ల విషయాన్ని దుర్గగుడి ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచుతూ బయటకు సమాచారం ఇవ్వడం లేదు. దసరా ఉత్సవాలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంటి పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు అధికారులు పాల్పడుతున్నారంటూ మంత్రులు, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు భక్తులు. నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన టెండర్లను రద్దు చేసి అర్హత కలిగిన వారికి టెండర్లను అప్పగించాలని ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన అనేక మంది కాంట్రాక్టర్లు అధికారులు కోరుతున్నారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన టెండర్లలో అవినీతి జరిగిందని హడావుడి చేసి రీటెండరింగ్ చేసిన జగన్ సర్కార్.. ఇఫ్పుడు మీ ప్రభుత్వంలోనే మంత్రుల అవినీతిని అరికట్టలేరా.. అని ప్రశ్నిస్తున్నారు. రీటెండరింగ్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అధికారులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి గానీ, దుర్గగుడి అధికారులు గాని స్పందించడం లేదు.