– రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ చుట్టూ రాజకీయం
– పరేడ్ తో వేడుకలు జరపాలన్న హైకోర్టు
– న్యాయస్థానం తీర్పుతో బీజేపీ ఎటాక్
– బండి, కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
– గవర్నర్ కి, బీజేపీకి ఏం సంబంధమన్న తలసాని
– ఏ వేడుకలైనా చట్టప్రకారమేనని కౌంటర్
– తమిళిసై పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య పెరిగిన దూరం నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకల అంశం హాట్ టాపిక్ అయింది. ఈసారి కూడా రాజ్ భవన్ లోనే వేడుకల్ని జరపాలని ప్రభుత్వం లేఖ పంపడంతో గవర్నర్ తమిళి సై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదేం పద్దతి కాదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలంగాణ హైకోర్టును ఓ వ్యక్తి ఆశ్రయించాడు. రిపబ్లిక్ డే వేడుకల్ని సజావుగా నిర్వహించాలని కోరాడు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కీలక తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకల్ని అధికారికంగా నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తారా? లేదా? చెప్పాలంది. పిటిషనర్ తరఫున న్యాయవాది, మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు. చివరకు అధికారికంగా పరేడ్ తో వేడుకలు జరగాలని న్యాయస్థానం తెలిపింది.
హైకోర్టు తీర్పుతో బీజేపీ ఎటాక్ స్టార్ట్ చేసింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. ఈ ఉత్తర్వులు కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. పరేడ్ తో కూడిన గణతంత్ర వేడుకలు నిర్వహించాలని సూచించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం గౌరవించాలని.. లేనిపక్షంలో ప్రజాస్వామ్య ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారని పేర్కొన్నారు.
ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదన్నారు. రిపబ్లిక్ డే వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారని చెప్పారు. అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారని ఆరోపించారు. మూడు నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని కేసీఆర్ సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్ తీరును ఖండిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. కొన్ని కనీస మర్యాదలు, గౌరవాలు పాటించాలని సూచించారు.
ఇటు గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ కు, బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏ వేడుకలైనా చట్ట ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని.. గవర్నర్ కంటి వెలుగుకు వస్తామంటే ఎవరైనా ఆపారా? అని అడిగారు.
మరోవైపు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక్క ఫైల్ ను కూడా కదలనివ్వడం లేదని ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వివేక్ దగ్గర రూ.వంద కోట్ల వరకు తీసుకుని హుజూరాబాద్ లో ఖర్చు పెట్టామని ఈటల చెప్పారన్నారు. ఆ డబ్బులు ఏమయ్యాయని ఐటీ, ఈసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి.