భారత్ లో ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూశాం. చిన్న సినిమాగా మొదలై ప్రస్తుతం బడా స్టార్స్ రికార్డ్స్ కూడా బద్దలు కొడుతోంది. దేశంలోని మిగిలిన భాషల్లో కూడా విడుదలకు సిద్ధమౌతోంది. అయితే.. న్యూజిలాండ్ లో మాత్రం ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ న్యూజిలాండ్ లో సెన్సార్ బోర్డు దగ్గర ఆగిపోయింది. బోర్డు సభ్యులను కొందరు ముస్లింలు కలిసి రిలీజ్ పై అభ్యంతరం తెలిపారు. మూవీలో ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్స్ చూపించినట్టుగా వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలా కట్స్ పడతాయని ప్రచారం జరుగుతోంది.
అయితే.. న్యూజిలాండ్ మాజీ ఉప ప్రధాని విన్ స్టన్ పీటర్స్ దీనిపై స్పందించారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఎన్నో దేశాల్లో విడుదలైన సినిమాను న్యూజిలాండ్ లో ప్రదర్శిచేందుకు అనుమతించకపోతే.. అది ప్రజల స్వేచ్ఛపై దాడి చేసినట్టేనని అభిప్రాయపడ్డారు.
మరోవైపు తమ సినిమాలో కొన్ని సీన్స్ కు న్యూజిలాండ్ సెన్సార్ బోర్డు కత్తెర వేయాలని అనుకుంటున్నట్టు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. చరిత్ర నేపథ్యం తెలియకపోతే ఇలాంటి సమస్యే ఏర్పడుతుందన్నారు. మూవీలో చూపించిన కథనం.. కాశ్మీర్ లో పండిట్ల ఊచకోతలని… ప్రధాన కథనానికే కత్తెర వేస్తే ఇంకా ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు.