మండుతున్న ఎండలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. 9 గంటల నుండే వేడి తీవ్రత దంచికొడుతోంది. అయితే.. వేసవికాలంలో మానవుని శరీరానికి రాగులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని ఈ సీజన్‌లో తినడం వల్ల మనిషికి అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరంలోని వేడి మొత్తం తగ్గి.. శరీరం చల్లగా మారుతోందని నిపుణులు చెప్తున్నారు.
డీహైడ్రేషన్ బారిన పడకుండా రాగులు కాపాడుతాయంటున్నారు. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా కాపాడేందుకు దోహదపడుతాయని అంటున్నారు. రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి రక్తం బాగా తయారవుతుందని.. రక్తహీనత సమస్య తగ్గుతోందని నమ్ముతుంటారు. దీంతో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులోకి వస్తోందని డాక్టర్ లు చెప్తున్నారు.
వీటిని వేసవిలోనే కాకుండా ఎప్పుడైనా వాడుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. రాగులను రుచిగా తినాలని కోరుకునే వారు వాటితో రాగి అంబలి తయారు చేసుకొని సేవిస్తుంటారు. ముందు తరం వారు ఎక్కువగా రాగి అంబలితోనే జీవనం గడిపేవారని పెద్దలు చెప్తున్నారు. దీంట్లో బలమైన పోషకాలు ఉండటంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తోందని నమ్ముతారు.
రాగి సంగటి ముద్దను రాత్రి తయారు చేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే ఒక పాత్రలో రాగి సంగటి ముద్దను సగం తీసుకుని అందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి.. అవసరమైనన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత దీన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే రాగి అంబలి తయారవుతుంది.