జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను హత్య చేసిన పనిమనిషి 23 ఏళ్ళ యాసిర్ లోహార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికోసం రాత్రంతా వారు గాలించారు. సోమవారం రాత్రి జమ్మూ శివార్ల లోని తన ఇంట్లో హేమంత్ కుమార్ లోహియా హత్యకు గురయ్యారు. ఈ హత్యకు తమదే బాధ్యత అని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఇందులో ఉగ్ర కోణం లేదని చెబుతున్నారు. అయితే రంబన్ జిల్లాలోని హల్లా-ధంద్రత్ గ్రామానికి చెందిన యాసిర్ కి, ఏదయినా ఉగ్రవాద సంస్థతో లింక్ ఉందా అని వారు ఆరా తీస్తున్నారు. 1992 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి హేమంత్ కుమార్ గత ఆగస్టులో జైళ్ల శాఖ డీజీపీగా నియమితులయ్యారని, ఆయన హత్య అత్యంత దురదృష్టకరమని డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు. 57 ఏళ్ళ హేమంత్ కుమార్ మృతదేహాన్ని తగులబెట్టడానికి కూడా యాసిర్ ప్రయత్నించాడని ఆయన తెలిపారు.
క్రైమ్ స్పాట్ ని ప్రాథమికంగా పరీక్షించి చూస్తే.. తన ఉబ్బి ఉన్న కాలికి లోహియా ఏదో ఆయిల్ పూస్తూ ఉండగా యాసిర్ హఠాత్తుగా ఆయనను ఊపిరాడకుండా చేసి.. హత్య చేశాడని, పగిలిన కెచప్ బాటిల్ తో ఆయన గొంతు కోశాడని, అనంతరం ఆయన శరీరానికి నిప్పంటించబోయాడని తెలుస్తోంది. జమ్మూ జోన్ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ ఇదే విషయాన్ని చెబుతూ.. గదిలో మంటలను చూసిన సెక్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకొని గది తలుపులు తీయబోగా లోపలి నుంచి గడియ పెట్టి ఉందని ఆయన చెప్పారు. మరి నిందితుడు ఎలా తప్పించుకున్నాడన్నది తెలియలేదు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా .. అతడు హత్య చేసిన అనంతరం పారిపోవడం స్పష్టంగా కనిపించిందని ఆయన తెలిపారు. లోహార్ గత ఆరు నెలలుగా ఇక్కడ పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అతగాడి ప్రవర్తన చాలా దురుసుగా ఉండేదని, డిప్రెషన్ తో బాధ పడేవాడని తెలిసినట్టు ముకేశ్ సింగ్ చెప్పారు.
కాగా తమ ‘హై వ్యాల్యూ టార్గెట్’ ని మట్టుపెట్టడానికి తమ ‘స్పెషల్ స్క్వాడ్’ పూనుకొందని, ‘ఇంటెలిజెన్స్ ఆధారిత’ సమాచారంతో ఈ ‘ఆపరేషన్’ చేపట్టామని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది. హిందుత్వ సిధ్ధాంతానికి హెచ్చరిక చేయడానికి తాము చేబట్టిన ఆపరేషన్లకు ఇది నాంది అని, తాము ఏ సమయంలోనైనా, ఎక్కడైనా దాడులకు దిగుతామని ఈ సంస్థ పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్ కి వస్తున్న హోం మంత్రి అమిత్ షాకు ఇది ‘గిఫ్ట్’ అని అభివర్ణించింది. భవిష్యత్తులో కూడా తాము ఇలాంటి ‘ఆపరేషన్స్’ చేపడతామని ఆన్ లైన్ ద్వారా హెచ్చరించింది. కానీ ఈ ఘటనలో ఉగ్ర కోణం ఉన్నట్టు తాము భావించడం లేదని అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. హేమంత్ కుమార్ హత్యకు వాడిన సాధనాన్ని, అలాగే పనిమనిషి మెంటల్ స్టేట్ కి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.