ఎట్టకేలకు పాపా కారును పోలీసులు పట్టుకుని చలాన్ విధించారు. అసలు ఈ పాపా ఏంటి..? పాపాకు చలాన్ విధించడం ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..! అసలు జరిగిన కథ ఏంటంటే..!
ఫిరోజాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన ముందు వెళ్తున్న కారు చిత్రాన్ని తీశాడు. దానిని ట్విటర్ పెట్టి పోలీసులను ట్యాగ్ చేశాడు. అసలు కారును ట్విటర్ పెట్టడం ఏంటి..? దానికి పోలీసులను ట్యాగ్ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా..? అసలు ఆ కారు నంబరు ప్లేట్ లోనే ఉంది కథంతా..!!
ఎందుకంటే నంబర్ ప్లేట్ నిశితంగా పరిశీలిస్తే హిందీలో పాపా అని రాసి ఉంది. ప్రస్తుతం భారత దేశంలో అలాంటి నంబర్ ప్లేట్లను ఉపయోగించడం నిషేధం.అలా ఎవరైనా ఉపయోగిస్తే వెంటనే పోలీసులు వారికి చలాన్ రాస్తుంటారు.
ఇప్పుడు అలాంటి నంబర్ ప్లేట్ ఒకటి నెట్టింట్లో పెట్టడమే కాకుండా..పోలీసులను ట్యాగ్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆ కారు నంబర్ ప్లేట్ ను సరిగా చూస్తే దాని నంబరు 4141. దానిని యజమాని పాపా అని హిందీలో రాయించారు. పైగా కారుకు పోలీసు స్టిక్కరింగ్ అతికించి ఉంది.
నెట్టింట్లో కారును పెట్టి పోలీసులను ట్యాగ్ చేయడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. వాహనాన్ని గుర్తించి …. మోటార్ వాహన చట్టం కింద చలాన్ వేసి నంబర్ ప్లేట్ ను సరిచేయించారు.దీనిని చూసిన నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తున్నారు.