ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటని ఎవరిని అడిగినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనే చెబుతారు. పార్టీలన్నీ అక్కడ గెలుపు కోసం అంతలా హడావుడి చేస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేగంగా వ్యాపిస్తుండడం కలవరానికి గురి చేస్తోంది. గత నెల రోజులుగా నమోదవుతున్న కేసుల్ని పరిశీలిస్తే.. అన్ని జిల్లాల్లో వైరస్ తగ్గుతున్నా.. కరీంనగర్ ను మాత్రం వదలడం లేదు. దానికి కారణం.. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న సభలు, కార్యక్రమాలేనని అంటున్నారు వైద్య నిపుణులు.
ప్రతీ రోజూ నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట పార్టీల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్నారు నాయకులు. దానివల్ల వైరస్ వ్యాప్తి జరుగుతోందని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా.. పార్టీ గెలుపు కోసమే ప్రజల ప్రాణాలతో ఆటలాడుతోందని ఆరోపిస్తున్నారు. నిజానికి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ప్రతిష్టాత్మకం. ఈటల చేతిలో ఓడితే భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం ఉంటుంది. అందుకే ఆపార్టీ మంత్రుల నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా అందర్నీ హుజూరాబాద్ లో దింపేసింది. సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఇంటింటికీ తిరగడం వల్ల వైరస్ వ్యాపిస్తోందని చెబుతున్నారు నిపుణులు.
గత నెల 29 నుంచి ఈనెల 4 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 190 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ.. ఒక్క మండలంలోనే ఈ కేసుల సంఖ్య వచ్చినట్టు స్థానిక మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. నాయకుల నిర్లక్ష్యంతోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని స్థానిక డాక్టర్లు మండిపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తర్వాతి రోజుల్లో వైరస్ ను అదుపు చేయడం కష్టంగా మారుతుందని… థర్డ్ వేవ్ కు ఉమ్మడి కరీంనగర్ వేదిక కావ్వొచ్చని హెచ్చరిస్తున్నారు.