దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే దేశంలో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ లను తప్పనిసరి చేసింది. ఇటు రాష్ట్ర రాజధానిలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో చిన్నా చితకా ఆసుపత్రులు మళ్లీ వసూళ్లకు తెరలేపాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజూ 2 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క బల్దియా పరిధిలోనే 1500లకు తగ్గకుండా కేసులు వస్తున్నాయి. ఇందులో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ లు కూడా ఉంటున్నాయి. నమూనాలను జీనోమ్ స్వీకెన్సులో పరిశీలిస్తేనే ఏ వైరస్ అనేది స్పష్టమవుతోంది. ఇది ఖర్చుతో కూడినది కావడంతో.. ప్రభుత్వ స్థాయిలో చాలా తక్కువగానే జీనోమ్ టెస్ట్ లు చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుత కేసుల్లో ఏ వైరస్ అన్నది తేలడం లేదు. పేరొందిన ఆసుపత్రుల్లో చేరిన బాధితుల పరిస్థితిని బట్టి రెమ్ డెసివిర్, కాక్ టెయిల్ మందుల్లో ఏది ఇవ్వాలన్నదానిపై వైద్య బృందం స్పష్టత ఇస్తుంది. ప్రస్తుతం చాలా వరకు ఒమిక్రాన్ కేసులే ఉండడం వల్ల ముందుగా రెమ్ డెసివిర్ మూడు డోసులు చేస్తున్నారు.
నగరంలో ఇప్పుడు వస్తున్న కరోనా కేసుల్లో 80 శాతం వరకు తక్కువ లక్షణాలున్న కేసులే నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ఔషధాలను వాడుతూ హోం ఐసోలేషన్ లోనే కోలుకుంటున్నారు. అయినా.. కొన్ని చిన్న ఆసుపత్రులు ముందుగా కాక్ టెయిల్ డోసు ఇచ్చి లక్షణాలు తగ్గకపోతే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజులకు రెమ్ డెసివిర్ డోసులు చేస్తున్నాయి. విచిత్రంగా యువతకు రెండింటినీ చేస్తుండడం గమనార్హం.
కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ సేవల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సిబ్బంది వార్డులను శుభ్రంగా చేశారు. మరోవైపు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున్ స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలోని 350 పడకలు ఆక్సిజన్ తో అనుసంధానమై ఉన్నాయి. ఈ క్రమంలో ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడేవారికి అందించే ఆక్సిజన్ ఫ్లోమీటర్లు, ఐసీయూ వార్డుల్లోని వెంటిలేటర్ల పనితీరునూ వారు పరిశీలించారు.