దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా మూడోరోజు 20 వేల దిగువనే నమోదైన కేసులు.. తాజాగా 13 వేలకు తగ్గిపోయాయి. పాజిటివిటీ రేటు 1.24 శాతంగా నమోదైనట్టు తెలిపింది. మృతుల సంఖ్య కూడా అదుపులోనే ఉన్నట్టు పేర్కొంది.
సోమవారం 10,84,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,405 మందికి పాజిటివ్ గా తేలింది. ముందురోజు కంటే కేసులు 16 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకినట్టు వెల్లడించింది.
ఇక 24 గంటల వ్యవధిలో 235 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 5,12,344 మంది మృతి చెందినట్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 2 లక్షల దిగువకు చేరాయని పేర్కొంది. ప్రస్తుతం ఆ కేసులు 1,81,075గా ఉండగా.. క్రియాశీల రేటు 0.42 శాతానికి తగ్గినట్టు అధికారులు వెల్లడించారు.
24 గంటల్లో 34,226 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం.. రికవరీలు 4.21 కోట్లకు పైనే ఉన్నాయని నివేదికలో తెలిపింది. 35,50,868 మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.