కరోనా వైరస్ తగ్గుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ.. కొన్ని దేశాల్లో దీని తీవ్రత కొనసాగుతూనే ఉంది. దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు.. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రష్యా, ఇజ్రాయెల్, బ్రెజిల్ లో కేసులు గరిష్టంగా పెరుగుతూ వస్తున్నాయి.
రష్యాలో ఆదివారం 1,89,071 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల క్రితంతో పోలిస్తే.. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ముందు రోజుతో చూసినా 2,800 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మరోవైపు బ్రిటన్ లో 54,095 కొత్త కేసులు వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 75 మరణాలు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ లో కరోనాతో ఐసీయూలో చేరిన కేసుల సంఖ్య 1,263గా ఉంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటుగా అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. టీకాలు తీసుకోని వారిలోనే సీరియస్ కేసులు బయటపడుతున్నట్లు పేర్కొంది. కొత్తగా 37,985 కేసులు అక్కడ వెలుగు చూశాయని.. టెస్ట్ పాజిటివిటీ రేటు 29 శాతంగా ఉందని అధికారులు చెప్తున్నారు.
కెనడాలో కొత్తగా 4,277 కేసులు వెలుగుచూడగా.. 62 మంది మరణించారు. బ్రెజిల్ లో 60వేల కొత్త కేసులు నమోదవగా.. 391 మంది మరణించారు. ఇటలీలో 77,029 కేసులు చూడగా.. 229 మంది మృత్యువాత పడ్డారు. యూరప్ లో బ్రిటన్ తర్వాత అత్యధిక మరణాలు ఇటలీలో నమోదయ్యాయని నిపుణులు వెల్లడించారు.