– ఫోర్త్ వేవ్ ముంచుకొస్తోందా?
– రోజురోజుకీ పెరుగుతున్న కేసులు
– మొన్న 3వేలు.. నిన్న 5వేలు.. నేడు 7వేలు
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7,240 మంది వైరస్ బారినపడగా..8మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 3,714 కేసులు ఉంటే.. బుధవారం 5,233 కు పెరగగా.. గురువారం ఏకంగా 7వేలు దాటాయి. ఈ లెక్కన రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
అయితే.. రికవరీ శాతం(98.71) బాగానే ఉండడం కాస్త ఊరటనిస్తోంది. కొత్తగా 3,591 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 32,498గా ఉంది. తాజా మరణాలను కూడా కలుపుకొని మొత్తం మృతుల సంఖ్య 5,24,723కి చేరుకుంది.
కరోనాకు మారోసారి మహారాష్ట్ర, కేరళ హాట్ స్పాట్ గా మారాయని కొత్త కేసులను చూస్తే అనిపిస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లోనే భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచి 2,701 బయటపడ్డాయి. వీటిలో 42 శాతం ఇన్ఫెక్షన్లు ముంబై నుండి నమోదయ్యాయి.
కేరళలోనూ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. గత 24 గంటల్లో 2,271 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ నియంత్రణ కోసం అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం వంటి నిబంధనలను మళ్ళీ అమల్లోకి తెచ్చింది. కేసులు ఇలాగే నమోదైతే ఫోర్త్ వేవ్ తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.