కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశకు చేరడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. చనిపోయిన ముగ్గురితో కలుపుకొని ఇప్పటి వరకు 169 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ నియంత్రించడానికి ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేసింది. ప్రజలు వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని లేకపోతే ఇంట్లోనే ఉండాలని సూచించింది. జమ్మూ కశ్మీర్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఢిల్లీలో 20 ఏళ్ల యువకుడికి వైరస్ టెస్ట్ పాజిటివ్ గా తేలింది. తమిళనాడులోనూ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఢిల్లీలో బుధవారం ఓ వ్యక్తి ఏడంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కరోనా ఆందోళనల నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి 8 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బుధవారం అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని వైరస్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.
గత రెండు వారాలుగా పలు రాష్ట్రాలు విద్యా సంస్థలు, మాల్స్, సినిమా హాళ్లు మూసివేశాయి. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే సభలు, సమావేశాలను రద్దు చేశాయి. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించాయి. వైరస్ లక్షణాలుండి తప్పించుకొని తిరుగుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మలేషియా లోని కౌలాలంపూర్ లో చిక్కుకున్న 405 మంది భారతీయ విద్యార్ధులను ఇండియాకు రప్పించినట్టు కౌలాలంపూర్ లోని ఇండియన్ హై కమిషనర్ తెలిపారు.
చైనాలో మొదటిసారిగా గురువారం ఒక్క పేషెంట్ కూడా నమోదు కాలేదు. వైరస్ వ్యాపించాక ఆ దేశంలో ఒక్క స్వదేశీ పేషెంట్ కూడా నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి. అయితే ఆ దేశంలో ఉన్న విదేశీ పేషెంట్ల వల్ల ఆందోళనలు నెలకొన్నాయి. గతంలో 81000 మంది ఈ వైరస్ బారిన పడగా ఇప్పుడు 7263 మంది బాధితులు మాత్రమే ఉన్నారు.
ఇండియా ముందస్తు చర్యలు భేష్ :
వైరస్ ను కట్టడి చేయడానికి భారతదేశం అంకితభావంతో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ప్రధాన మంత్రి మొదలు కొని కింది స్థాయి వరకు అందరూ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. ఈ కారణంగానే ఇండియాలో వైరస్ వ్యాప్తిని నియంత్రించగలుగుతున్నారని భారత్ లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి హెంక్ బేక్ డమ్ అన్నారు.
గత ఏడాది డిసెంబర్ లో చైనాలోని వుహాన్ సీ పుడ్ మార్కెట్ లో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వేలాది మందిని బలి తీసుకుంది. లక్షలాది మందికి వైరస్ సోకింది. కోట్లాది మందిని క్వారంటైన్లకు పరిమితం చేసింది. పలు దేశాల జన జీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. ఆర్ధిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.