దేశంలో కరోనా వైరస్ కొత్త కేసుల సరళి విచిత్రంగా మారింది. గత నెల రోజులుగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. దేశంలో వైరస్ తీవ్రత తగ్గుతోందా లేక నిలకడగా కొనసాగుతోందా అన్నది అర్థం కావడం లేదు. ఓ రోజు 10 వేలకు దిగువకు పడిపోతే..ఆ మరుసటి రోజే15 వేల వరకూ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ హెచ్చూ, తగ్గులనూ పక్కనబెడితే… సగటున 11 వేల మార్క్ వద్ద నిలిచిపోవడం ఆసక్తికరంగా మారుతోంది.
తాజాగా ఇవాళ కూడా దేశంలో కొత్తగా 11,610 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,37,320కు పెరిగింది. ఇక కరోనా కారణంగా నిన్న మరో 100 మంది చనిపోగా.. ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,55,913కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,36,549 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 20.79 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.