తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఇటీవలే కేంద్రం ప్రభుత్వం.. రెండు డోస్ లు పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోస్ ను అందించేలా చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వాలు ఆంక్షల బాట పడుతున్నాయి. అదే బాటలో నడవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో.. కేబినెట్ సమావేశం నిర్వహించడానికి సిద్ధం అయ్యారు సీఎం కేసీఆర్. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
దేశంలో, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే విద్యా సంస్థల సెలవులు పొడిగించిన నేపథ్యం ఓవైపు.. కోవిడ్ కట్టడికి ఇతర రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తోన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ లాక్ డౌన్ పెడతారా..? లేదంటే నైట్ కర్ఫ్యూ విధిస్తారా..? లేక మరో విధమైన ఆంక్షలు పెడతారా..? అనేది చర్చగా మారింది. ఒక వేళ లాక్ డౌన్ విధిస్తే.. సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి? పబ్లిక్ ప్లేస్ లలో ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. విద్యా సంస్థలకు సెలవులు 30వ తేదీ వరకు పొడిగించినా.. ఈ సమయంలో ఆన్ లైన్ క్లాసులు ఉంటాయా..? లేదా..? అనేది కూడా రేపటి కేబినెట్ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.