తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ లో కొవిడ్ తీవ్రత రెట్టింపైంది. రోజుకు 500 కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 493 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 29,084మంది సాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 493 పాజిటివ్ కేసులు పాజిటివ్ గా తేలాయి. నిన్న కరోనా నుంచి 219 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం తెలంగాణలో 3,322 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నాయి.
కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. బయటకు వెళ్లేవారు, సమూహాల్లో తిరిగేవారు తప్పకుండా మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించాలని కోరింది.