కరోనా వైరస్ తో చైనాలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు చైనాలో చనిపోయిన వారి సంఖ్య 490 కి చేరింది. మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 23,214. కొత్త కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. కానీ అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ వైరస్ ను మొదట గుర్తించిన చైనాలోని హుబెయ్ ఫ్రావిన్స్ లోని వుహాన్ నగరంలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఈ ఫ్రావిన్స్ లో ఒక్క రోజులోనే 64 మంది చనిపోయారు. పారిశ్రామిక కేంద్రంగా ఉన్న హుబెయ్ ఫ్రావిన్స్ లోని వుహాన్ లో చైనీయులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన కార్మికులు లక్షలాది మంది జీవిస్తున్నారు. ఇప్పటికే ఈ నగర ప్రజలు పూర్తిగా గృహ నిర్బంధంలో ఉన్నారు. నగరం నుంచి బయటకు, బయటి నుంచి ఈ నగరానికి రాకపోకలు నిలిపివేశారు. నిత్యావసర సరుకుల కోసం రెండు రోజులకొకసారి బయటకు పంపిస్తున్నారు. అత్యవసర విధులు నిర్వహించే వారిని తప్ప ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు అనుమతించడం లేదు. అయితే వుహాన్ నగరంపై దట్టమైన పొగ ఆవరించి ఉంది. ఇదంతా కరోనా వైరస్ మృతుల సామూహిక దహనంతో ఏర్పడిన పొగ కాలుష్యమని విదేశీ పత్రికలు రాస్తున్నాయి.
వ్యాధి తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వృద్ధ దంపతులు ఇద్దరికి ఈ వ్యాధి సోకి హాస్పిటల్లో చేరారు. వారు హాస్పిటల్ బెడ్స్ పై పడుకొని ఇక తాము బతకమని తెలిసి గుడ్ బై..గుడ్ బై అంటూ ఒకరినొకరు పదే పదే చెప్పుకునే వీడియో హృదయ విదారకంగా ఉంది. ఈ వీడియోను చూసి చలించిపోయిన వారు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ పెట్టారు. అదే మాదిరిగా కరోనా వైరస్ సోకిన నర్స్ ఒకరు తన కూతురిని చూసి గుండెలకు హత్తుకోవాలనుకున్నా ఆ పని చేయలేక… చేతులు చాచి దూరంగా నిల్చొని తల్లీ కూతుళ్లు ఏడుస్తున్న వీడియో హృదయం ద్రవింపజేస్తోంది. కూతురు తీసుకొచ్చిన టిఫిన్ బాక్స్ ను దూరంగా పెట్టగా తల్లి తీసుకొని వెళ్లే దృశ్యం చూపరులకు కంట తడి పెట్టిస్తోంది.
ఇది ఇలా ఉండగా..గత కొన్ని రోజులుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. వ్వవసాయ పనులు ఆగిపోయాయి.
కరోనా వైరస్ ఇప్పుడు చైనానే కాదు ఇతర దేశాలను కూడా వణికిస్తోంది. ఇప్పటి వరకు 26 దేశాల్లో ఈ వ్యాధి సోకిన రోగులను గుర్తించారు. భారత దేశంలోని కేరళలో ముందుగా ఈ వైరస్ ను నిర్ధారించారు. ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురిలో ఈ వైరస్ ఉన్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. వారు ముగ్గురు కూడా చైనా నుంచి తిరిగొచ్చిన విద్యార్ధులు. ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేరళ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. దాదాపు 40000 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను వైరస్ నియంత్రణ కోసం నియమించింది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు కరోనా వైరస్ నియంత్రణ పనిలోనే ఉన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ అనుమానంతో హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ కేరళలో మూడు కేసులు తప్ప ఇంకా ఎక్కడా వ్యాధి నిర్దారణ కాలేదు.
జపాన్ తీర ప్రాంతంలో క్రూయిజ్ షిప్ లో 10 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ జరిగింది. హాంగ్ కాంగ్ నుంచి 3,711 మంది ప్రయాణీకులతో జపాన్ కు చేరుకున్న క్రూయిజ్ లోని ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించి పరిశీలిస్తున్నారు. చాలా దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. చైనా నుంచి తమ దేశానికి…తమ దేశాల నుంచి చైనాకు వెళ్లే ప్రయాణీకులపై నిషేధం విధించాయి. విమానాలను రద్దు చేశాయి. దేశాల సరిహద్దుల్లో కూడా మందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.