చైనాలో లో కరోనా మృతుల సంఖ్య తాజాగా వెయ్యి దాటింది. మంగళవారానికి 1016 మంది చనిపోయారు. వైరస్ తీవ్రంగా ఉన్న ఒక్క హుబెయ్ ఫ్రావిన్స్ లో ఒక్కరోజే 103 మంది ప్రాణాలు విడిచారు. హుబెయ్ ఫ్రావిన్స్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సీనియర్ డాక్టర్లను ప్రభుత్వం తొలగించింది. కరోనా వైరస్ కు సంబంధించి ఏ రోజు కారోజు తాజా పరిస్థితిని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 42,638 మందికి వైరస్ ను నిర్ధారించినట్టు తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో అడవి జంతువుల మాంసాన్ని అమ్మే వుహాన్ మాంసం మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాపించింది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సోమవారం బీజింగ్ లో మెడికల్ వర్కర్స్, కరోనా పేషెంట్స్ ను కలుసుకున్నారు. వైరస్ కట్టడికి ఇంకా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో వైపు వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందం సోమవారం రాత్రి చైనాకు చేరుకుంది. బ్రూస్ ఇల్వార్డ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇల్వార్డ్ బృందం 2014-2016 లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ను నియంత్రించడంలో పని చేసింది.
చైనాలో వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ… కొత్త కేసుల నమోదు క్రమంగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే చైనాతో ప్రయాణ సంబంధాలు లేకపోయినప్పటికీ విదేశాల్లో ఈ వైరస్ ఆందోళన కలిగించే ఉదాహరణలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గెబ్రెసస్ హెచ్చరించారు. బ్రిటన్ వైరస్ సోకిన వారి సంఖ్య రెట్టింపై 8 కి చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ లో ఎండలు ఎక్కువగా ఉంటున్నందున వైరస్ నాశనమవుతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.