ప్రపంచదేశాలను సైతం గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పుడు మరో సారి ప్రజలను వణికించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,483 మందికి పాజిటివ్ గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 1399 మంది ప్రాణాలు కోల్పోగా.. 1970 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 62వేలకు చేరింది. మరణాల సంఖ్య 5.23 లక్షలకు పైగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.55 శాతానికి పైగా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు సంఖ్య 4,30,62,569 కు చేరగా.. 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 5,23,622 నమోదవగా.. 42,523,311 మంది రోగులు రికవరీ అయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సోమవారం 22,83,224 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,95,76,423 కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 3, 81,485 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 1,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.