ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా… సామాన్య ప్రజలనే కాదు ప్రజాప్రతినిధులను కూడా వదలట్లేదు. తాజాగా గుంటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ముుస్తఫా ఫ్యామిలీకి కరోనా భయం వెంటాడుతుంది. గుంటూరు జిల్లాలో నమోదయిన రెండు కేసులు ఆ ఎమ్మెల్యే సమీప బంధువులవే. మత పరమైన సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యే బంధువు తిరిగి వచ్చేటప్పుడు కరోనాను తీసుకొచ్చాడు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన సదరు వ్యక్తి చాలా మందితో సన్నిహితంగా వ్యవహరించారు. కరోనా లక్షణాలు బయటపడ్డ తరువాత ఆయనను క్వారంటైన్‌కు పంపించి టెస్టులు చేయించారు. అక్కడ పాజిటివ్ గా తేలింది. ఇదే విషయమై జిల్లాలో కలకలం రేగుతున్న సమయంలో ఆయన భార్యకు కూడా అదే లక్షణాలు బయటపడ్డాయి.
భార్యకు కూడా టెస్టులు చేయించడంతో పాజిటివ్‌గా తేలింది. వారంతా ఎమ్మెల్యే కుటుంబంతో కలిసి మెలిసి ఉండేవారు. దీనితో ఆ కుటుంబం మొత్తం భయాందోళన చెందుతుంది. మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బంధువు పాల్గొన్నారు. అతను కలిసిన వారందరికీ టెస్టులు చేయిస్తున్నారు. తమ కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలడం వారిద్దరూ తమతో సామాజిక దూరం పాటించకపోవడంతో ఎమ్మెల్యే కుటుంబం తమను క్వారంటైన్‌లో ఉంచాలంటూ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది.
అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంత మంది వస్తే క్వారంటైన్ లో ఉంచడం సాధ్యం కాదని చెప్పి డాక్టర్ లు పంపించేశారు. దాంతో అధికారులు వారికి వేరే ప్రైవేటు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. గుంటూరులో విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా పాజిటివ్ కేసు వచ్చింది. ఆయన ద్వారా కాంటాక్ట్ కేసు కూడా నమోదయింది. ఒక్క సారిగా జిల్లాలో కరోనా కలకలం రేగటంతో అధికారులు మరింత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.