కరోనా కోరలు చాస్తోంది. రోజు వారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెండు రోజుల నుంచి లక్షకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఒక్కో రాష్ట్రం నెమ్మదిగా ఆకాంక్షలు చట్రంలోకి పోతుంది. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలు, వేడుకలపై పరిమితులు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలకు జనవరి16 వరకు సెలవులు ప్రకటించింది. రాజకీయ పార్టీలు కూడా జనవరి 16 వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపింది. వీటితో పాటు నైట్ కర్ఫ్యూ విధించింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిని 50 శాతం సామర్థ్యంతో నడిపించాలని సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు వ్యాక్సిన్ తీసుకున్న ధ్రువపత్రాన్ని చూపించాలనే నిబంధన తీసుకొచ్చింది.
అటు అస్సాం రాష్ట్రం కూడా ఆంక్షలను అమలు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5వ తరగతి వరకు పిల్లలకు జనవరి 30 వరకు సెలవులు ప్రకటించింది. రాష్ట్ర రాజధాని నగరంలో గువహతిలో మాత్రం మహమ్మారి కేసులు ఎక్కువ బయట పడటంతో 8వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవు ప్రకటించింది. దీంతోపాటు నైట్ కూడా కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నట్టు తెలిపింది.
మరోవైపు గోవా ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచిస్తోంది. గుంపులు గుంపులుగా ఉంటే పోలీసులు ఫైన్లను వేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండటంతో రాజకీయ పార్టీల బహిరంగ సభలకు 100 మందికి పర్మిషన్ ఇచ్చింది. అంతకంటే ఎక్కువగా హాజరైతే కఠిన చర్యలు తప్పవని గోవా ప్రభుత్వం హెచ్చరించింది.
కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. అత్యవసర సేవలు మినహా ఇతర వ్యాపారాలకు అనుమతి నిరాకరించారు. అటు గుజరాత్ కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తోంది. నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. రాజకీయ పార్టీల సభలకు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు 400 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అంత్యక్రియలకు 100 మందికి మించి హాజరుకాకూడదని హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో 75% సిబ్బందితో నడిపించాలని తెలిపింది. గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విచారణను రద్దు చేసుకుంది. ఆన్లైన్ ద్వారా కేసులు విచారణ చేయనున్నట్టు ప్రకటించింది.