తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో 66 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 9 వైద్యసిబ్బంది ఉండగా.. 57 మంది రోగులకు ఈ మహమ్మారి సోకింది. ఎక్కువ మందికి తేలిక పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెంట్ తెలిపారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచామని అన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో ఈ మహమ్మారి ఇటీవల ఎక్కువగా ఫ్రంట్ లైన్ వారియర్స్ పై ఎక్కువగా దాడి చేస్తుంది. పది రోజుల క్రితం గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 44 మందికి, ఉస్మానియా ఆసుపత్రిలో 50కి కరోనా పాజిటివ్‌గా తేలింది. గాంధీలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్ సర్జన్స్ కోవిడ్ బారిన పడ్డారు. అటు.. ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు ఈ వైరస్ సోకింది.
మరోవైపు పోలీస్ శాఖలో కూడా కరోనా కలవరపెడుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ సిబ్బంది కోవిడ్ బారిన పడుతున్నారు. థర్డ్ వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా 5వందల మంది పోలీస్ సిబ్బందికి పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో కరోనా కేసులు పెరగడంతో పోలీసులు భయపడుతున్నారు.