కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాస్త నెమ్మదించిన ఈ మహమ్మారి ఇంకా అక్కడక్కడ వ్యాపిస్తోంది. ఈ ఏడాదిన్నర కాలంలో చాలా మందికి కరోనా రావడం పోవడం జరిగిపోయింది. కొంత మందికి ఈ వైరస్ వారం పాటు ఉంటే మరికొంత మందికి పదిహేను రోజుల పాటు ఉంది. ఇంకొంత మందిపై దాని ఎఫెక్ట్ నెల రోజుల పైన ఉండి ఉంటుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రం దాదాపుగా పది నెలల నుంచి కరోనా కంటిన్యూగా ఉండటం అందరికీ షాక్ ఇస్తోంది. అది కూడా 72 ఏళ్ళ వ్యక్తి కావడం మరింత దిగ్భ్రాంతికర విషయం.
వివరాల్లోకి వెళితే… యునైటెడ్ కింగ్డమ్ లో నివసిస్తున్న ఓ వ్యక్తికి 10 నెలలుగా కరోనా వైరస్ అలాగే ఉంది. అంటే 290 రోజులు కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ తోనే ఉన్నారాయన. అతని పేరు డేవిడ్ స్మిత్. 2020లో యూకేలో ఫస్ట్ వేవ్ ప్రారంభమైన సమయంలో ఈ 72 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. బ్రిస్టల్ కు చెందిన రిటైర్డ్ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ స్మిత్ ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చికిత్స చేయడానికి ఉపయోగించిన రీజనెరాన్ యాంటీ బాడీ కాక్టెయిల్ సహాయంతో కోలుకున్నాడు. ఇది కొత్త కణాలకు కరోనా సోకకుండా అడ్డుకుంటుంది. బ్రిటన్ లో వైద్య పరంగా దీనిని నిషేధించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో డేవ్ కోసం ఉపయోగించారు. ఇక ఆయన పరిస్థితి విషమించినప్పుడల్లా… దాదాపు అయిదు సార్లు ఆయన భార్య అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమైందట. ప్రస్తుతం ఆయన కోలుకోవడం విశేషం.