కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ తో ప్రపంచం అల్లకల్లోలం అయింది. మొదటి వేవ్ నుండి కాస్త ఊరట కలుగుతుందనుకున్న సమయంలో సెకండ్ వేవ్ వచ్చి వణికించింది. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ నుండి తేరుకోక ముందే థర్డ్ వేవ్ విలయతాండవం చేయడానికి సిద్దం అవుతోంది. ఇది ఇలా ఉంటే రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రోజుకు లక్ష కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. అనుకున్న దానికంటే అధికంగా దాని ప్రభావాన్ని చూపుతోంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. ఏపీలోనూ ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనా రక్కసి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కరోనా సోకి ఐసోలేషన్ లో ఉన్నారు.
అయితే వైద్యులకు సైతం కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. ఈ కాలేజీలో ఇప్పటివరకు 22 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే తాజాగా మరో 7 గురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపాల్ కాలేజీలో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా కాలేజీకి ఈ నెల 17వరకు సెలవులు ప్రకటించారు.