గాంధీ ఆస్పత్రిలో 46ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఈ వ్యక్తికి సంబంధించిన మరో వ్యక్తి కూడా కరోనా వైరస్ కోసం అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే… పేషెంట్ చనిపోయారు అని చెప్పడంతో జూనియర్ డాక్టర్ పై పేషెంట్ బంధువు దాడికి దిగటం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమపై దాడికి దిగడంతో జూడాలు ఆందోళకు దిగారు.
పోలీసులకు సమాచారం అందించగానే ఏకంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గాంధీ కి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చారు.దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో జూడాలు ఆందోళన విరమించారు.
గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ ల పై దాడిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి? …డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారు.వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి డాక్టర్లకు హామీ ఇచ్చారు.