భారత్ లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గురువారం నాటికి దేశంలో కరోనాకు 13 మంది చనిపోయారని.. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 649 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 45 మంది కోలుకోవడంతో వారిని హాస్పిటళ్ల నుంచి డిశ్యార్చ్ చేశారు. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 593 మంది ఉన్నారు. దేశం మొత్తమ్మీద 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వైరస్ వ్యాపించింది.
గురువారం చనిపోయిన వారిలో కశ్మీర్ కు చెందిన ఒకరు. మహారాష్ట కు చెందిన వారొకరు ఉన్నారు. కశ్మీర్ లో ఇది మొదటి కరోనా మృతి కాగా…మహారాష్ట్రలో నాలుగోది. కశ్మీర్ కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి శ్రీనగర్ శివారులోని హైదర్ పొరాకు చెందిన ఇస్లాం మత బోధకుడు. మూడు రోజుల క్రితం అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవలెనే అతను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి మార్చి 16న ఇంటికి చేరుకున్నారు.
కశ్మీర్ లో మొదటి కరోనా మృతి నమోదు కావడంతో హైదర్ పొరా పరిసర ప్రాంతాలను పోలీసులు సీజ్ చేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అతనితో సన్నిహితంగా ఉన్న నలుగురిని బుధవారం గుర్తించి పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. వీరు కాక ఏడుగురు డాక్టర్లతో సహా మరో 70 మందికి అతని ద్వారా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ 11 కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు కోలుకున్నారు. కశ్మీర్ లో ప్రభుత్వ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. శ్రీనగర్ సిటీకి వెళ్లే దారులన్నింటిని మూసేశారు. ఆంక్షలు ఉల్లంఘించిన 200 మందిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేవారు.
మహారాష్ట్రలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. మొత్తం 120 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. నవీ ముంబై లో మార్చి 24 న చనిపోయిన మహిళకు కరోనా టెస్ట్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె బంధువులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తుండడంతో కర్ఫ్యూ విధించవలసి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా జిల్లాలకు, పల్లెలకు వైరస్ వ్యాప్తి చెందనీయమన్నారు. లాక్ డౌన్ వల్ల నిత్యావసర సరుకులకు ఎలాంటి కొరత ఏర్పడదని చెప్పారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43 కి చేరింది. వీరిలో ఒకరికి నయం కావడంతో హాస్పిటల్ నుంచి పంపించేశారు. మొత్తం బాధితుల్లో 10 మంది ఇండోనేషియాకు చెందిన వారున్నారు. ఏపీలో 11 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు కోలుకున్నారు. కేరళలో ఈ సంఖ్య 118 కి చేరింది.