ఏపీలో కరోనా మహమ్మారి విజంభిస్తోంది. రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు సూచించారు.
నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు కరోనా సోకింది. హోం క్వారంటైన్ లో ఉన్నారనని.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా జాగ్రత్తలు ప్రతీ ఒక్కరు పాటించాలని లోకేష్ అన్నారు.
ఏపీలో కొత్తగా 4,108 మందికి వైరస్ సోకిందని తేలింది. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 30,182 చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 21,07,493 పాజిటివ్ కేసులకు గాను 20,62,801 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు కరోనా మరణాలు నమోదు కాలేదు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 14510మంది కరోనాతో మృతి చెందారు.
రాష్ట్రంలో చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యికి పైగా కేసులు ఈ రెండు జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఈ రోజు విశాఖలో అత్యధికంగా 1,018 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తర్వాత చిత్తూరు 1,004, గుంటూరు 345, కడప 295, నెల్లూరు 261, తూర్పుగోదావరి 263, ప్రకాశం 176, కృష్ణా 170 కేసులు నమోదయ్యాయి. విజయనగరం 169, అనంతపురం 162, శ్రీకాకుళం 114, కర్నూలు 85, పశ్చిమగోదావరి జిల్లాలో 46 మందికి కరోనా సోకింది.