విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళ చేసిన హల్ చల్ అందరికి చెమటలు పట్టించింది. కుత్బుల్లాపూర్ గణేష్ నగర్ కు చెందిన ఓ మహిళ గురువారం విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. పాజిటివ్ గా తేలడంతో హాస్పిటల్ కి తరలిస్తుండగా అధికారుల కండ్లు కప్పి అక్కడ నుండి తప్పించుకుంది.
కంగారు పడ్డ అధికారులు ఆమె పాస్ పోర్ట్ ఆధారంగా అడ్రస్ ను గుర్తించి స్థానిక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ బాలరాజు, వైద్య శాఖ అధికారులు మహిళ నివాసానికి చేరుకున్నారు. కానీ అక్కడి నుండి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది ఆ మహిళ. స్థానికుల సాయంతో అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి లోని టిమ్స్ కు తరలించారు. కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ కు తరలించారు.