ఆదివారం వచ్చిందంటే చాలు కరోనా లక్షణాలున్నవారితో పాటు టెస్టుల కోసం వేచి చూస్తున్న వారి గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. కారణం ఒక్కటే… ఆదివారం వచ్చిందంటే చాలు కరోనా పరీక్షల్లో భారీ వ్యత్యాలు కనపడటమే. అసలే అరకొర సిబ్బందితో కాలం వెల్లదీస్తున్న తెలంగాణలోని బస్తీ దావఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆదివారం సిబ్బంది హజరుకాకపోవటంతో ఆ ప్రభావం సోమవారంపై పడుతుంది.
ప్రభుత్వం యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను భారీగా అందుబాటులోకి తెచ్చింది. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారికి ర్యాపిడ్ టెస్టులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ టెక్నిషియన్ల కొరతకు తోడు ఆదివారం కొందరు సెలవు తీసుకుంటుండటంతో ఆ ప్రభావం టెస్టులపై పడుతుంది.
ఆదివారం వచ్చినా ముఖ్యమైన సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రుల్లోనే పరీక్షలు కొనసాగుతున్నాయి. లక్షణాలున్న వారు ఆర్టీపీసీఆర్ టెస్టుకు వెళ్దామా అంటే అక్కడ ఫలితం రావడానికి కనీసం 2-3రోజులు అయినా పడుతుంది. దీంతో కరోనా అనుమానితుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.