– కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే..
– ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలపై వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత..!
తెలంగాణలో మళ్లీ కరోనా దడ పుట్టిస్తుండటంతో, దాదాపు 3 నెలల తర్వాత కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంతో పలు కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ ఇంకా మనతో పాటే ఉంది.. పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. ప్రజలంతా బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆయన సూచించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కరోనా ప్రస్తుతం ఎండమిక్ దశలో ఉంది. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది మధ్యలో ఎండ్ కావొచ్చు. ప్రస్తుతం నమోదువుతున్న కేసులతో దేశంలో, రాష్ట్రంలో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదు. మరో ఆరు నెలలు ఇలా పెరుగుదల ఉండొచ్చు. కేసుల పెరుగుదలతో ఆందోళన చెందొద్దని ప్రజారోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో గత వారం 355, ఈవారం 555 కేసులతో 56 శాతం పెరుగుదల కనిపించిందని డీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 811 ఉన్నాయి.
ఆసుపత్రిలో చేరికలు, మరణాలు లేవు. మూడు రోజులుగా 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ దాదాపు పూర్తవడం వల్ల ఇమ్యునిటీ సాధించాం. వర్షా కాలంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు వ్యాక్సినేషన్ అత్యంత అవసరం. 12–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది’అని స్పష్టం చేశారు.
ప్రస్తత దశలో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యాక్సినేషన్ దాదాపు వందశాతం పూర్తవడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగింది. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నా అది ఫోర్త్ వేవ్ కు కారణం కాకపోవచ్చు. వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దని సూచించింది. మొత్తానికి కొవిడ్ వైరస్ పూర్తిస్థాయిలో నిర్మూలన జరిగే వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూనే, పలు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.