భారత్ లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ కలకలాన్ని రేపుతున్నాయి. 67 రోజుల తర్వాత క్రియాశీల కరోనా పేషెంట్ల సంఖ్య 3 వేలు దాటింది. కోవిడ్ కేసుల ఆకస్మిక పెరుగుదలతో పాటు, H3N2 వైరస్ కేసుల పెరుగుదల మరింత ఆందోళనను కల్గిస్తోంది.
అయితే కరోనా రోగులు సడెన్ గా ఎందుకు పెరుగుతున్నారన్న దానితో పాటు H3N2 వైరస్ తో ఏమైనా సంబంధముందా అనే దానిపై పరిశోధకులు పరిశీలిస్తున్నారు. అయితే గత 3 వారాల నుంచి దేశంలో కరోనా పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఫిబ్రవరి 30 నుంచి మార్చి5 మధ్య దేశంలో 1898 కొత్త కరోనా రోగులున్నారు.
మొదటి వారంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య కంటే ఇది 63 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 20 నుంచి 26 మధ్య 1163 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది మునుపటి వారం కంటే 39 శాతం ఎక్కువ. అదే సమయంలో.. ఫిబ్రవరి 13 నుంచి 19 మధ్య 839 కరోనా ఇన్ఫెక్షన్ కేసులున్నాయి. ఇది మునుపటి వారం కంటే 13 శాతం ఎక్కువ.
అయితే కేరళ,కర్ణాటక, మహారాష్ట్రలలో సగానికి పైగా యాక్టివ్ కరోనా కేసులున్నాయి. కేరళలో అత్యధికంగా 1474, కర్ణాటకలో 445, మహారాష్ట్రలో 379 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కొత్తగా 326 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో 67 రోజుల తర్వాత యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 3,000 దాటింది.
ఇక ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,775 కాగా, యాక్టివ్ కేసులు 3,076 కి చేరుకున్నాయి. అదే సమయంలో దేశంలో 4.46 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా రోగుల ఆకస్మిక పెరుగుదలతో పాటు H3N2 వైరస్ రోగులు కూడా పెరుగుతున్నారు. దీంతో ఆరోగ్యనిపుణులు పెరుగుతున్న ఇన్ ఫ్లూఎంజా కేసులపై పరిశోధిస్తున్నారు.