హైదరాబాద్ వాసులకు ఇరానీ చాయ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఉదయాన్నే ఇరానీ చాయ్ తాగనిదే కొందరికి రోజు గడవదు. ఇరానీ చాయ్ అందించే కేఫ్‌లలో గంటల తరబడి కూర్చుని నగరవాసులు ముచ్చట్లలో తేలిపోతుంటారు. అయితే కరోనా వల్ల అవన్నీ బంద్ అయ్యాయి. కస్టమర్లు లేక ఇరానీ కేఫ్‌లు వెలవెలబోతున్నాయి. కరోనా వల్ల ఇరానీ కేఫ్‌లకు భారీగా ఆదాయం పడిపోయి కార్మికులు, యాజమాన్యాలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు.
కరోనాకు ముందు ఒక కప్పు ఫుల్ ఇరానీ చాయ్ ధర రూ.10, సింగిల్ చాయ్ ధర రూ.8 ఉండేది. కానీ ఇప్పుడు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో ఫుల్ కప్పు ఇరానీ చాయ్‌ను రూ.15కి, సింగిల్ చాయ్‌ని రూ.10కి విక్రయిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో తమకు భారీగా నష్టాలు వచ్చాయని, ఆ నష్టాల నుంచి బయట పడేందుకు ఇప్పటికీ కష్టపడుతున్నామని నగరంలోని ఒక కేఫ్‌కు చెందిన ఓనర్ తెలిపారు.
ఇరానీ చాయ్ తయారీకి ఉపయోగించే పదార్థాల ధరలన్నీ పెరిగాయి. వర్కర్లు కూడా లాక్‌డౌన్ నష్టాలను భర్తీ చేసేందుకు తమకు జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాల ధరలను కూడా పెంచారు. దీంతో చాయ్ ధరలను పెంచక తప్పడం లేదని మరొక ఓనర్ తెలిపారు.
సాధారణంగా ఒక మోస్తరు ఇరానీ కేఫ్ అయితే రోజుకు 2,500 కప్పుల చాయ్‌ని అమ్ముతారు. అదే మెయిన్ సెంటర్లలో ఉండే కేఫ్‌లలో అయితే ఇంకొన్ని వందల కప్పుల చాయ్‌ని ఎక్స్‌ట్రా అమ్ముతారు. కానీ కరోనా లాక్‌డౌన్ అనంతరం ఎక్కడ చూసినా కేఫ్‌లు చాలా తక్కువ సంఖ్యలో జనాలతో కనిపిస్తున్నాయి. పైగా కరోనా వ్యాపిస్తుందనే నెపంతో జనాలు కేఫ్ లకు వచ్చేందుకు భయపడుతుండడంతో కేఫ్‌ల యాజమాన్యాలు పింగాణీ కప్పులకు బదులుగా పేపర్ కప్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. దీంతో ఆ కప్పులకు అయ్యే ఖర్చులు కేఫ్‌ల యాజమాన్యాలకు అదనపు భారంగా మారాయి.
ఒక పెద్ద పేపర్ కప్పు ఖరీదు హోల్‌సేల్ మార్కెట్‌లో 65 పైసలు ఉంటుంది. అదే చిన్న కప్పు అయితే 35 పైసలు ఉంటుంది. గతంలో అయితే పింగాణీ కప్పులు వాడేవారు కనుక వీటి ఖర్చుల భారం పడేది కాదు. కానీ కరోనా నేపథ్యంలో పేపర్ కప్పులను వాడుతున్నారు. దీని వల్ల కేఫ్‌ల యాజమాన్యాలకు అదనంగా ఖర్చు అవుతోంది.
Advertisements
లాక్ డౌన్ అనంతరం అసలు వ్యాపారం సాగడం లేదు. కేవలం కొందరు మాత్రమే కేఫ్‌లకు వచ్చి చాయ్ తాగుతున్నారు. కరోనా వ్యాపిస్తుందనే కారణంలో జనాలు రావడం లేదు. వచ్చినా గతంలోలా ఎక్కువ సేపు ఉండడం లేదు. దీంతో మాకు కష్టాలు తప్పడం లేదు.. అని మరొక కేఫ్ ఓనర్ తెలిపారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందరికీ పంపిణీ అయ్యి తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడితే వీరి పరిస్థితి మారేందుకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.