ఏపీలో కరోనా కమ్మేస్తుంది. తుఫాన్ లా ముంచుకొస్తుంది. నమోదవుతున్న రోజువారీ కేసులతో అధికారులు అయోమయానికి గురువుతున్నారు. ప్రతీ రోజు ముందు రోజు కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 4వేల 528 కేసులు నమోదవగా ఇవాళ 5 వేలకు చేరువలో కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో 35వేల 673 కరోనా టెస్టులు చేయగా, 4వేల 955 మందికి కరోనా సోకినట్టు తేలింది.
ఈ మహమ్మారితో పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 14వేల 509కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 397 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22వేల 870కి పెరిగింది. గత కొన్ని రోజులుగా చిత్తూ, విశాఖపట్నం జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో రెండు జిల్లాల్లో మొత్తం రెండు వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. విశాఖపట్నం జిల్లాలో 1103, చిత్తూరు జిల్లాలో 1039 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,18,32,010 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 21,01,710కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,64,331.
సంక్రాంతి ముందు ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వవర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడే ఇంత మంది మహమ్మారి బారినపడితే.. పండగ సమయంలో ఇంకెంత సంక్రమిస్తుందో అని భయపడుతున్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్కులు వాడకం, సామాజిక దూరం పాటించడం లాంటివి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలతో పాటు వైరస్ కట్టడికి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జరుగుతోంది. ఏపీలో సంక్రాంతి తరువాత నైట్ కర్ఫ్యూ అమలుకానుంది.