భారత్ లో నిన్న తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా.. ఈ రోజు మరోసారి విజృంభించింది. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 మంది కరోనా బారిన పడ్డారు. ముందు రోజు కంటే సుమారు 45 వేల కేసులు ఎక్కువగా నమోదయ్యయి. దీంతో అధికారిక వర్గాల్లో ఆందోళన మొదలైంది.
కరోనా కేసులతో పాటు మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. ఈ రోజు కరోనాతో 441 మంది మరణించారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 4,87,202కి పెరిగింది. అటు.. కొత్తగా 1,88,157 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,55,83,039మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 8,961 ఒమిక్రాన్ కేసుల వెలుగు చూశాయి.
కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. మంగళవారం ఒక్కరోజే 76,35,229 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశంలో 1,58,88,47,554 వ్యాక్సిన్లు అందించారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి మొత్తం 3.7 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. 56,66,263 బూస్టర్ డోసుల్ని కేంద్రం అందించింది.