దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మంగళవారం ఏకంగా 58,097 మంది కరోనా బారినపడినట్టు తేలింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముందురోజు 37వేల కేసులు నమోదవ్వగా.. 24 గంటల్లో కేసుల పెరుదల రేటు 70శాతంగా ఉండటం భయాందోళనలకు గురి చేస్తోంది. అటు, నిన్న ఒక్కరోజు 534మంది కరోనాతో మృతి చెందారు.
దేశంలో ఒక్కసారిగా ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ ను వేగవంతం చేశాయి. 18 ఏళ్ల లోపు పిల్లలకు టీకాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం అయింది. 60ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుల పంపిణీ జనవరి 10 నుంచి జరగనుంది. భారీగా నమోదవుతున్న కేసులను పరిశీలస్తున్న నిపుణులు కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందని చెబుతున్నారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవున్నాయి. తాజాగా నమోదైన కేసులతో ఒమిక్రాన్ బాధితల సంఖ్య 2,135కి చేరింది. ఇప్పటి వరకు 828 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర 653, ఢిల్లీ 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హర్యానా 71 ,ఒడిశా, ఉత్తరప్రదేశ్ 31, ఆంధ్ర ప్రదేశ్ 24, వెస్ట్ బెంగాల్ 20 , మధ్యప్రదేశ్ 9 ,ఉత్తరాఖండ్ 8, గోవా 5 కేసులు నమోదు అయ్యాయి.
అటు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 21 లక్షల పైగా కేసులు నమోదు అయ్యాయి. 6,656 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రిటన్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 5,67,696 కేసులు, బ్రిటన్‌లో 2,18,724కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో2,71,686 కేసులు, ఇటలీలో1,70,844 కేసులు వెలుగు చూశాయి.