దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న కాస్త శాంతించినట్టు కనిపించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడింది. భారీగా కేసులను నమోదు చేసింది. కొత్తగా లక్షా 94 వేల 720 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ రోజు నమోదైన కరోనా మృతుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది. కొత్తగా 442 మంది ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ లో నమోదైన రోజువారీ మరణాల్లో ఇవే ఎక్కువ. అయితే, పాజిటివిటీ రేటు కాస్త ఉరటనిచ్చింది. 11.05 శాతానికి తగ్గింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా రోగుల సంఖ్య 3కోట్ల 60 లక్షల 70 వేల 510కి చేరింది. ఇప్పటి వరకు 3కోట్ల 46లక్షల 30వేల 536 మంది కోలుకోగా.. ఇంకా 9 లక్షల 55వేల 319 మంది ఆస్పత్రిల్లో కానీ.. హోం ఐసోలేషన్ లో కానీ చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి దాటికి ఇప్పటివరకు 4 లక్షల 84వేల 655మంది బలైయ్యారు.
ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు ఒమిక్రాన్ కూడా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 5 వేలకు చేరువ అవుతున్నాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం 4868 మందికి ఈ వైరస్ సోకిందని చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.
కరోనా, ఒమిక్రాన్ మూకుమ్మడిగా దాడి చేయడంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయింది. మంగళవారం ఒక్కరోజే 85లక్షల 26వేల 240 డోసులు పంపిణీ చేశారు. దీంతో, మొత్తం 153కోట్ల 80లక్షల 8వేల 200 డోసులు అందించారు. వ్యాక్సినేషన్ తో పాటు కరోనా కట్టడికి దేశంలో కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్లు మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు జరుగుతున్నాయి.