దేశంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి సుడిగాలి వేగంతో వ్యాప్తిస్తోంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులు వైద్య నిపుణులను సైతం చెమటలు పట్టిస్తున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా 2,68,833 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 4631 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 14,17,820 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 1,22,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 16.66శాతంగా ఉంది. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6041కి చేరింది.
రోజువారీ కేసులు భారీగా నమోదవుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేశారు. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్లు అమల్లో ఉన్నాయి. థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్స్ 50శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తున్నారు. మాస్కుల వాడకం, సామాజిక దూరం తప్పనిసరి చేశారు. కరోనా కట్టడికి నిబంధనలతో పాటు ప్రభుత్వాలు టీకా పంపిణీ శరవేగంగా జరుపుతోంది. శుక్రవారం ఒక్కరోజే 58,02,976 డోసులు అందించారు. ఇప్పటివరకు మొత్తం 1,56,02,51,117 టీకాల పంపిణీ జరిగింది.