తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,963 మందికి కరోనా సోకింది. 53,073 కరోనా పరీక్షలు చేయగా.. ఈ కేసులు బయటపడ్డాయి. ముందురోజు కంటే తాజాగా నమోదైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇప్పటి వరకు తెలంగాణలో 7,05,199మందికి కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా కరోనాతో రెండు మరణాలు సంభవించాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,054కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అటు రోజువారీ రికవరీ రేటు కూడా గణనీయంగా నమోదవుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో 1,620 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 6,81,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.31 శాతానికి తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 22,017 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,05,73,637 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,21,430 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 7,696 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మాస్కులు వాడకం, భౌతికదూరం పాటించడం వంటివాటిని ప్రభుత్వం తప్పని సరి చేసింది.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సెలవులు 16తో ముగియాల్సి ఉంది. అయితే, కొవిడ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.